Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, October 7, 2013

ద్వితీయోపదేశకాండము 13

Deu 13:1  ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి 
Deu 13:2  నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల 
Deu 13:3  అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. 
Deu 13:4  మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. 
Deu 13:5  నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. 
Deu 13:6  నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని 
Deu 13:7  భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల 
Deu 13:8  వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. 
Deu 13:9  చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. 
Deu 13:10  రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. 
Deu 13:11  అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. 
Deu 13:12  నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు 
Deu 13:13  పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. 
Deu 13:14  అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల 
Deu 13:15  ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. 
Deu 13:16  దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును. 
Deu 13:17  నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు 
Deu 13:18  నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు. 

No comments:

Post a Comment